Hyderabad: హైదరాబాద్‌లో ఈ రోజు రాత్రి ఫ్లైఓవర్ల మూసివేత.. రేపు కూడా ట్రాఫిక్ ఆంక్షలు
- జగ్‌నేకీ రాత్ నేపథ్యంలో నిర్ణయం
- గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మినహా మిగతావి మూసివేత
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లను నేటి రాత్రి 10 గంటల నుంచి రేపు తెల్లవారు జాము వరకు మూసివేయాలని నగర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్వాల్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్లు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే మినహా హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.
జగ్‌నేకీ రాత్ నేపథ్యంలో హైదరాబాద్‌లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఇందులో భాగంగా రేపు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దీంతో రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. తాజ్ ఐలాండ్, ఛాపెల్ రోడ్, ఓల్డ్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్, బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంపుల నుంచి వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది.