Mamata Banerjee: మమత ఎడమకాలు, కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలు: హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్న వైద్యులు
- మమతకు ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
- మరో 2 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి
- రెండు నెలల విశ్రాంతి అవసరం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్ లో నిన్న దాడి జరిగిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఎడమకాలితో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. అంతేగాక, ఆమె ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
మరో రెండు రోజుల పాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలో వుండాలని, ఆమెకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని వివరించారు. ఇదిలావుంచితే, మమతపై దాడి నేపథ్యంలో టీఎంసీ నేతలు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో వాయిదా పడింది.
మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మేనిఫెస్టోను విడుదల చేస్తారు. కాగా, మమత ఆరోగ్య పరిస్థితిపై టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. ఇప్పటికే ఆమెపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ డీజీపీ రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.