Cheddi Gang: చెడ్డీగ్యాంగ్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష.. నిజామాబాద్ సెషన్స్ కోర్టు తీర్పు
- నిజామాబాద్‌లో ఓ ఇంట్లో 15 తులాల బంగారం అపహరణ
- డిసెంబరు 2019లో రాచకొండ పోలీసులకు చిక్కిన ముఠా
- నిందితులందరూ మహారాష్ట్ర వారే
నిజామాబాద్‌లో దొంగతనాలకు పాల్పడి ఆపై పోలీసులకు చిక్కిన చెడ్డీ గ్యాంగ్‌కు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 4 నవంబరు 2019లో నిజామాబాద్‌లోని లలితానగర్‌లో పెద్ద తిమ్మయ్య ఇంట్లో చెడ్డీగ్యాంగ్ ముఠా మారణాయుధాలతో ప్రవేశించి 15 తులాల బంగారం అపహరించింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, అదే ఏడాది డిసెంబరు 29న ఓ కేసులో రాచకొండ కమిషనరేట్ పోలీసులు సదరు ముఠాను అరెస్ట్ చేశారు.
విచారణలో వారు నిజామాబాద్‌లోనూ దొంగతనం చేసినట్టు అంగీకరించారు. దీంతో వారిని అక్కడి పోలీసులకు అప్పగించారు. తాజాగా, ఈ కేసులో వాదనలు విన్న సెషన్స్ కోర్టు జడ్జి కిరణ్మయి ముఠాలోని ఆరుగురు సభ్యులకు ఏడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో నిందితుడు ఎండీ సాజిద్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతడిపై నమోదైన కేసును కొట్టివేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందిన వారే.