COVAXIN: మిగతా కరోనా వ్యాక్సిన్ల కన్నా కొవాగ్జినే మంచిది: లాన్సెట్ అధ్యయనం
- అల్జెల్ అనే అడ్జువెంట్ తో పనితీరు మెరుగు
- ఆ అడ్జువెంట్ తో వచ్చిన మొదటి వ్యాక్సిన్
- రెండో దశ ట్రయల్స్ ఫలితాల ప్రకటన
మొదట్లో కొవాగ్జిన్ అనగానే చాలా మంది అనేక సందేహాలను వ్యక్తం చేశారు. ట్రయల్సే పూర్తి కాని వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా వేస్తారని ప్రశ్నించారు. కానీ, మిగతా వ్యాక్సిన్ల కన్నా కొవాగ్జినే మంచిదని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది. కొన్ని రోజుల క్రితం వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగ ఫలితాలను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ను బీబీవీ152 కోడ్ నేమ్ తో పేర్కొన్న అధ్యయనం.. చాలా సురక్షితమని, తీవ్రమైన దుష్ఫ్రభావాలు చాలా తక్కువని వెల్లడించింది.
ఇతర నిర్జీవ కరోనా వ్యాక్సిన్లతో పోలిస్తే.. అల్జెల్ (అల్యూమినియం జెల్) అనే అడ్జువెంట్ కలిగిన ఐఎండీజీతో తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యుత్తమమని పేర్కొంది. అల్జెట్ అడ్జువెంట్ ద్వారా వ్యాక్సిన్ పనితీరు మెరుగవుతుందని పేర్కొంది. ఈ అడ్జువెంట్ తో వచ్చిన తొలి వ్యాక్సిన్ ఇదేనని, కాబట్టి దాని పనితీరును మరింత శ్రద్ధగా అంచనా వేసేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. కాగా, వ్యాక్సిన్ తో 81 శాతం వరకు మంచి ఫలితాలు వచ్చినట్టు గత వారం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.