Ram Nath Kovind: 'మహిళల స్ఫూర్తికి వందనం'.. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు
- మహిళలు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు: కోవింద్
- వారి విజయాలతో దేశం గర్విస్తోంది: మోదీ
- మహిళా సాధికారతయే జాతి సాధికారత: తమిళిసై
- పాలనలో, అభివృద్ధిలోనూ అతివలది కీలకపాత్ర: కేసీఆర్
- మహిళలకు సెల్యూట్ చేస్తున్నానన్న జగన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధిస్తున్నారని, కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. మహిళలు, పురుషుల పట్ల సమానత్వం చూపాలని తెలిపారు. వారి మధ్య అసమానతలు తొలగించేందుకు కృషి చేద్దామని పేర్కొన్నారు.
మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు.
'ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అడ్డంకులను, కష్టాలను, అసమానతలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న మహిళల స్ఫూర్తికి వందనం. మహిళా సాధికారతయే జాతి సాధికారత. కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్ధికి మహిళల సేవ, త్యాగం, కృషి అభినందనీయం' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
పాలనలోను, అభివృద్ధిలోనూ అతివలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నిరూపించుకున్నారని తెలిపారు. మహిళా సంక్షేమంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
పలు రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తోన్న ఆంధ్రప్రదేశ్ మహిళలకు సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. లింగ వివక్షకు చరమగీతం పాడుతూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే కృషిని కొనసాగించడానికి ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు.
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు తన తల్లి, భార్య,కూతురి ఫొటోలను షేర్ చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. మహిళలు అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.