Oliver Dassault: హెలికాప్టర్ కూలిన ఘటనలో ఫ్రెంచ్ బిలియనీర్ ఓలివర్ దస్సాల్ట్ దుర్మరణం!
- నార్త్ ఫ్రాన్స్ లో ఘటన
- తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మేక్రాన్
- ఘటనపై విచారణకు ఆదేశం
ఫ్రాన్స్ కు చెందిన రాజకీయ వేత్త, దస్సాల్ట్ ఏవియేషన్ యజమానుల్లో ఒకరైన ఓలివర్ దస్సాల్ట్, ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్, భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో ఉత్తర ఫ్రాన్స్ పరిధిలోని డేవిల్లీ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఫ్రాన్స్ అధికార వర్గాలు వెల్లడించాయి.
ఓలివర్ మృతి తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారు. దేశ పరిశ్రమలకు ఆయన రారాజని కొనియాడుతూ, చనిపోయేంత వరకూ ఆయన దేశానికి సేవ చేస్తూనే ఉన్నారని అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. 69 ఏళ్ల ఓలివర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.
ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ కూడా మరణించారు. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ తరఫున రిచర్డ్ ఫెర్నాండ్ నివాళులు అర్పిస్తూ, దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన దస్సాల్ట్ కుటుంబం, గుండె నిబ్బరంతో ఉండాలని అన్నారు. కాగా, ఓలివర్ దస్సాల్ట్, గతంలో వ్యాపార పనుల నిమిత్తం పలుమార్లు భారత్ లోనూ పర్యటించారు.