Omar Abdullah: బెంగాల్ మరో కశ్మీర్ అయితే తప్పేంటి?: ఒమర్ అబ్దుల్లా
- కశ్మీర్ స్వర్గం అయిందన్నారు కదా
- అయినా బెంగాలీలకు కశ్మీర్ అంటే ఎంతో ప్రేమ
- కారుకూతలు కూసిన మిమ్మల్ని క్షమించేస్తున్నా
- సువేందు అధికారి వ్యాఖ్యలపై మండిపాటు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీపై మరోసారి విమర్శలు కురిపించారు. బెంగాల్ మరో కశ్మీర్ అయితే ఏంటంటూ వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమ బెంగాల్ లోని ముచిపారాలో బీజేపీ నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు గానీ (తృణమూల్ కాంగ్రెస్) అధికారంలోకి వస్తే.. బెంగాల్ మరో కశ్మీర్ అవుతుందంటూ వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలపై ఒమర్ ట్విట్టర్ లో స్పందించారు. ‘‘మీ బీజేపీ వారి ప్రకారం 2019 ఆగస్టు తర్వాత కశ్మీర్ స్వర్గం అయింది కదా. మరి, బెంగాల్ మరో కశ్మీర్ అయితే తప్పేంటి? ఏదైతేనేం.. బెంగాలీలకు కశ్మీర్ అంటే ఎంతో ప్రేమ. వారు పెద్ద సంఖ్యలో కశ్మీర్ కు వస్తుంటారు. కాబట్టి పిచ్చిమాటలు, కారుకూతులు కూసిన మిమ్మల్ని క్షమించేస్తున్నా’’ అని ఒమర్ ట్వీట్ చేశారు.