Girl: నలుగురిని ప్రేమించిన అమ్మాయి... గ్రామ పెద్దలు ఏం చేశారంటే..!
- యూపీలోని అజీమ్ నగర్ లో ఓ యువతి ప్రేమ పురాణం
- నలుగురు యువకులతో కలిసి వెళ్లిపోయిన యువతి
- గ్రామానికి తీసుకువచ్చిన పెద్దలు
- ఎవర్ని పెళ్లాడాలో తేల్చుకోలేకపోయిన అమ్మాయి
- ఓ చిన్నారితో లక్కీ డ్రా తీయించిన గ్రామపెద్దలు
ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి నలుగురిని ప్రేమించడమే కాదు, వారితో ఊరు విడిచి వెళ్లిపోయింది. అయితే గ్రామ పెద్దలు వారిని ఊరికి తీసుకువచ్చి, వారిలో ఒకరితో ఆ అమ్మాయికి పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు. అందుకోసం ఓ లక్కీ డ్రా కూడా తీశారు.
వివరాల్లోకి వెళితే... యూపీలోని అజీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏకంగా నలుగురిని ఇష్టపడింది. వారు కూడా ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఇటీవల ఆ అమ్మాయి నలుగురు యువకులతో కలిసి తన బంధువుల ఇంటికి చేరింది. అయితే ఇది గ్రామ పరువుకు సంబంధించిన విషయం కావడంతో పెద్దలు ఆ అమ్మాయిని, నలుగురు యువకులను ఊరికి తీసుకువచ్చారు.
ఆ నలుగురు యువకుల్లో ఒకరిని పెళ్లాడాలని ఆ యువతికి సూచించారు. దాంతో ఆ అమ్మాయి ఎటూ తేల్చుకోలేకపోవడంతో లాటరీయే శరణ్యమని భావించారు. ఆ నలుగురు యువకుల పేర్లు చీటీలపై రాసి ఓ చిన్నారితో లక్కీ డ్రా తీయించారు. ఓ యువకుడి పేరు రావడంతో, ఆ యువతికి సదరు యువకుడితో పెళ్లి ఖాయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందట.