Laxman Muthiyah: భారత సైబర్ నిపుణుడికి బంపర్ బొనాంజా అందించిన మైక్రోసాఫ్ట్
- సాఫ్ట్ వేర్ లొసుగులతో పొంచి ఉన్న ప్రమాదం
- లోపాల గుర్తింపుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న సంస్థలు
- మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో లోపాన్ని గుర్తించిన లక్ష్మణ్ ముత్తయ్య
- రూ.36 లక్షల బహుమతి కైవసం
సాఫ్ట్ వేర్ లో చిన్న లోపం ఉంటే చాలు, పెను విపత్తు పొంచి ఉంటుంది. ఆయా కంపెనీల సాఫ్ట్ వేర్ లోని లోపాలు హ్యాకర్ల పాలిట వరాలు అవుతాయి. అందుకే అగ్రశ్రేణి ఐటీ సంస్థలు బగ్ బౌంటీ పేరిట తమ సాఫ్ట్ వేర్ల లోని లోపాలను గుర్తించే వారికి భారీ నజరాలు ప్రకటిస్తాయి. తాజాగా భారత్ కు చెందిన లక్ష్మణ్ ముత్తయ్యను మైక్రోసాఫ్ట్ బగ్ బౌంటీ అవార్డు వరించింది. అంతాఇంతా కాదు... ఏకంగా రూ.36 లక్షల విలువ చేసే బహుమతి అందుకున్నాడు.
మైక్రోసాఫ్ట్ కు చెందిన సాఫ్ట్ వేర్ లో ఉన్న లోపాన్ని ముత్తయ్య గుర్తించాడు. ఈ లోపం సాయంతో యూజర్ల మైక్రోసాఫ్ట్ అకౌంట్లను హైజాక్ చేసే ప్రమాదం ఉంది. ఐడీ, పాస్ వర్డ్ లతో పనిలేకుండానే ఆయా అకౌంట్లు హ్యాకర్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. ముత్తయ్య గతంలో ఇదే తరహా బగ్ ను ఇన్ స్టాగ్రామ్ లోనూ గుర్తించాడు. కాగా, దీనిపై ముత్తయ్య స్పందిస్తూ, తాను గుర్తించిన లోపం పట్ల మైక్రోసాఫ్ట్ ఎంతో వేగంగా స్పందించిందని, లోపాన్ని చక్కదిద్దిందని వెల్లడించాడు.