UK: బ్రిటన్ యువరాణి మెఘన్ పై టైమ్స్ సంచలన కథనం.. దర్యాప్తు చేయిస్తామన్న బ్రిటన్ రాజకుటుంబం
- పని వారిని వేధించారని వార్త ప్రచురించిన పత్రిక
- యువతులను చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు
- వేధింపులను సహించబోమన్న రాజకుటుంబం
- తప్పుడు కథనాలన్న మెఘన్ ప్రజా సంబంధాల అధికారి
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ భార్య, యువరాణి మెఘన్ మార్కెల్ పై టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రాజసౌధంలో ఉన్నప్పుడు తన సిబ్బందిని మెఘన్ వేధించారని ఆరోపించింది. ప్రత్యేకించి యువతులను ఆమె చిత్రహింసలకు గురి చేశారని పేర్కొంది. 2018 నాటి ఫిర్యాదును ప్రస్తావించింది. మెఘన్ వేధింపులు భరించలేక ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది రాజసౌధంలో ఉద్యోగం మానేసి వెళ్లిపోయారని రాసింది.
టైమ్స్ కథనంపై రాజకుటుంబం (ద ఫర్మ్) స్పందించింది. మెఘన్ చర్యలపై దర్యాప్తు చేయిస్తామని ప్రకటించింది. తమ మానవ వనరుల విభాగం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తుందని తెలిపింది. పత్రికలో వచ్చిన కథనాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రకటించింది. దర్యాప్తులో భాగంగా నాడు పనిచేసిన సిబ్బందితో పాటు ఉద్యోగం మానేసిన వారినీ ఇక్కడకు పిలిపిస్తామని తెలిపింది.
పనివిధానాలను రాజకుటుంబం ఎంతో పకడ్బందీగా అమలు చేస్తుందని, పని ప్రదేశంలో ఎలాంటి వేధింపులను సహించబోమని స్పష్టం చేసింది. రెండేళ్ల కిందట హ్యారీ, మెఘన్ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వారికి బాబు ఆర్చీ ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు.
కాగా, ఆరోపణలపై మెఘన్ ప్రజా సంబంధాల అధికారి స్పందించారు. ఈ ఆరోపణలతో మెఘన్ చాలా బాధపడ్డారని చెప్పారు. ఆమె గుణాన్ని చెడుగా చూపించడంతో కలత చెందారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమె మంచి పనులు చేస్తున్నారని, మంచి పనులు ఎవరు చేసినా ఆమె మద్దతుగా నిలుస్తారన్నారు. పత్రికలో వచ్చిన కథనాలకు ఆధారాలు లేవని, అవన్నీ తప్పుడు కథనాలని ఆమె తేల్చి చెప్పారు.