Corona Virus: నిన్న ఏపీ, టీఎస్ సహా 21 రాష్ట్రాల్లో నమోదుకాని కరోనా మరణాలు!

No Corona Deaths in 21 States and UTs

  • కనిష్ఠానికి పడిపోయిన మరణాలు
  • 98 మంది కన్నుమూశారన్న కేంద్రం
  • అందులో 70 శాతం మందికి దీర్ఘకాలిక రోగాలు
  • టీకా పంపిణీ వేళలపై ఆంక్షలు తొలగింపు

'కరోనా ముక్త భారత్' దిశగా అడుగులు పడుతున్నాయి. ఓ వైపు హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి కేసుల సంఖ్య తగ్గడం, మరోవైపు శరవేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ వల్ల మరణాల సంఖ్య కనిష్ఠానికి పడిపోయింది. గడచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే కేసులు అధికంగా ఉన్నాయని, మొత్తం నమోదైన దాదాపు 15 వేల కేసుల్లో 85 శాతానికి పైగా ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.

ఈ రాష్ట్రాల్లో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురేసి సభ్యులతో కూడిన కేంద్ర బృందాలను పంపించామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా కారణంగా నిన్న 98 మంది మరణించారని, వీరిలోనూ 70 శాతం మందికి పైగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారేనని అన్నారు.

ఇదిలావుండగా, కరోనా టీకా పంపిణీ వేళలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా టీకాను పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, ప్రజలు వారికి నచ్చిన సమయంలో వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, ప్రైవేటు ఆసుపత్రులు టీకా పంపిణీ వేళలను ముందుగానే నిర్ణయించుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

Corona Virus
Vaccine
Death
Rate
  • Loading...

More Telugu News