Kesineni Nani: విజయవాడలో అందరూ ఫైటర్లే... మమ్మల్నెవరూ బెదిరించలేరు: కేశినేని నాని
- ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
- నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని
- ఇతర ప్రాంతాల్లో టీడీపీ నేతలను బెదిరించారని వెల్లడి
- విజయవాడలో ఆ పరిస్థితి లేదని వ్యాఖ్యలు
- ఇక్కడెవరూ లొంగేవాళ్లు లేరని స్పష్టీకరణ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో తాము కచ్చితంగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తన 21 నెలల పాలనపై జగన్ కే నమ్మకం లేదని, అందుకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
విజయవాడలో మాత్రం తాము గట్టిగా నిలబడ్డామని, నామినేషన్ల సమయంలో ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు ఎదురైనా తాము అభ్యర్థులకు అండగా నిలిచామని వెల్లడించారు. తాము అన్నిచోట్ల నామినేషన్లు వేశామని, ఇవాళ ఉపసంహరణలు చేయాలని బెదిరిస్తే ఎవరూ లొంగేవాళ్లు లేరని ఉద్ఘాటించారు. విజయవాడలో అందరూ ఫైటర్లేనని, తమనెవరూ ఒత్తిడికి గురిచేయలేరని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ఇటీవల బెజవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలోనూ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే, నాలుగు రకాల ఆలోచనా ధోరణలు ఉంటాయని అన్నారు. ఏదైనా విభేదాలు వస్తే చర్చించి పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇప్పుడు సీఎం జగన్ ఇంట్లోనూ విభేదాలున్నాయని, ఆయనొక పార్టీ పెడితే, చెల్లి షర్మిల మరో పార్టీ పెడుతోందని నాని వెల్లడించారు. ఒక ఇంట్లోనే విభేదాలున్నప్పుడు రాజకీయ పార్టీల్లో ఉండవా? అని ప్రశ్నించారు.