USA: హెచ్-1బీ వీసాలపై నిషేధం ఎత్తివేత ఇప్పట్లో సాధ్యం కాదన్న అమెరికా!

USA Downplays  H1B Visa Ban Revoke

  • పదవి నుంచి వైదొలగే ముందు నిషేధం విధించిన ట్రంప్
  • తాను రాగానే తొలగిస్తానని బైడెన్ హామీ
  • అంతకన్నా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయంటున్న అమెరికా

భారత ఔత్సాహికుల 'డాలర్ డ్రీమ్స్' ఇప్పట్లో నెరవేరే సూచనలు కనిపించడం లేదు. వేలాది మంది ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసాలపై నిషేధాన్ని ఇప్పట్లో తొలగించే అవకాశాలు లేవని అమెరికా అంటోంది. ఈ విషయంలో బైడెన్ సర్కారు వెనక్కు తగ్గినట్టుగా సమాచారం.

తమ ముందు మరిన్ని ముఖ్యమైన అంశాలున్నాయని వ్యాఖ్యానించిన హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో యమోర్కాస్, నిషేధం ఎత్తివేత ఇప్పట్లో సాధ్యం కాదన్న సంకేతాలిచ్చారు. తాము ప్రస్తుతం శరణార్థుల సమస్యల పరిష్కారంతో పాటు, చట్టవిరుద్ధంగా తమ తల్లిదండ్రులతో దేశానికి వచ్చిన వారిని ఆదుకోవడం, వృత్తి నిపుణుల సమస్యల పరిష్కారంపై దృష్టిని సారించామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, తాను పదవి నుంచి వైదొలగే ముందు డొనాల్డ్ ట్రంప్, హెచ్-1బీ వీసాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, తాను బాధ్యతలు స్వీకరించగానే దాన్ని తొలగిస్తానని జో బైడెన్ హామీ ఇచ్చారు. ట్రంప్ చివరి రోజుల్లో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెనక్కు తీసుకున్నారు కూడా. అయితే, వీసాలపై ఉన్న ఆంక్షలపై మాత్రం ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. హెచ్1-బీ వీసాలపై నిషేధం తొలగిస్తే, అమెరికన్లలో వ్యతిరేకత రావచ్చని బైడెన్ భావిస్తుండటమే ఇందుకు కారణం.

ఇక ట్రంప్ విధించిన నిషేధం ఈ నెలాఖరు వరకూ అమలులో ఉంటుంది. ఆపై అక్టోబర్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాలను కోరుతూ వచ్చిన దరఖాస్తులను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News