Maharashtra: కరోనా ఎఫెక్ట్: రద్దీ నియంత్రణకు ముంబైలో రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర భారీగా పెంపు
- మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
- టికెట్ ధర రూ. 50కి పెంపు
- జూన్ 15వ తేదీ వరకు అమల్లో
ముంబై, నగర శివారు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు రూ. 10గా ఉన్న టికెట్ ధరను రూ. 50కి పెంచుతూ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంపై కరోనా మహమ్మారి మరోమారు పగబట్టిన నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నివారించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, లోక్‌మాన్య తిలక్ టెర్మినస్‌తోపాటు థానే, కల్యాణ్, పాన్‌వెల్, భీవండి రోడ్ స్టేషన్లలో పెరిగిన ధరలు జూన్ 15 వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వేసవి ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.