Narendra Modi: 2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తెస్తాం: ప్రధాని మోదీ
- మారిటైమ్ ఇండియా సదస్సును ప్రారంభించిన ప్రధాని
- మారిటైమ్ ఇండియా విజన్ బుక్ ఆవిష్కరణ
- సముద్రరంగంలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని వెల్లడి
- ఇతర దేశాలు భాగస్వాములు కావాలని పిలుపు
- ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
ప్రధాని నరేంద్ర మోదీ మారిటైమ్ ఇండియా-2021 సదస్సును ప్రారంభించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మారిటైమ్ ఇండియా విజన్-2030 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారిటైమ్ రంగంలో భారత్ విజయాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ విజయయాత్రలో భాగస్వాములు అవ్వాలని ప్రపంచదేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సముద్ర రంగంలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు.
దేశంలో నౌకాశ్రయాల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని, 2030 నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని ఉద్ఘాటించారు. జల రవాణా మార్గాలు చౌక మాత్రమే కాదని, పర్యావరణ హితం కూడా అని అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నామని వివరించారు.
పోర్టులపై 2035 నాటికి 82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఓడరేవుల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. సముద్రరంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. అటు సముద్ర పర్యాటకానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని, 78 లైట్ హౌస్ ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.