PSLV C51: నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో నమ్మినబంటు... ప్రయోగం విజయవంతం

PSLV Rocket successfully launch satellites in orbit

  • ఈ ఉదయం 10.24 గంటలకు ప్రయోగం
  • అన్ని దశలు విజయవంతం
  • కక్ష్యల్లోకి 19 ఉపగ్రహాలు
  • వివరాలు తెలిపిన ఇస్రో చైర్మన్
  • ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన బ్రెజిల్ మంత్రి

అనేక సంవత్సరాలుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు నమ్మినబంటులా ఘనమైన సేవలు అందిస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ మరోసారి తనకున్న గుర్తింపును సార్థకం చేసుకుంది. ఈ ఉదయం 10.24 గంటలకు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ51 వాహకనౌక అనుకున్న పని పూర్తి చేసింది. అనుకున్న సమయానికే రోదసిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.

అన్ని దశల్లోనూ రాకెట్ పనితీరు సవ్యంగానే ఉందని, బూస్టర్లు, ఉపగ్రహాలు సజావుగా విడివడ్డాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. కాగా, ఈసారి ప్రయోగానికి ఓ ప్రత్యేకత ఉంది. బ్రెజిల్ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి మార్కస్ క్వాంటస్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోట వచ్చారు. విదేశీ అతిథి సమక్షంలో పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

కాగా, ఈసారి పీఎస్ఎల్వీ రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో బ్రెజిల్ కు చెందిన అమెజానియా-1 కూడా ఉంది. దీనిపై శివన్ మాట్లాడుతూ, బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన మొదటి ప్రయోగం సఫలం కావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.

పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 53వ రాకెట్ ప్రయోగం కాగా, శ్రీహరికోట నుంచి జరిగిన 75వ ప్రయోగం. ఇక భారత్ కు చెందిన ఓ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ పేరు, భగవద్దీత, 25 వేల మంది పేర్లను పంపారు. ఈ పేర్లలో 1000 మంది విదేశీయులతో పాటు చెన్నై విద్యార్థుల పేర్లు కూడా ఉన్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News