PSLV: పీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ షురూ!
- శ్రీహరికోట ప్రయోగ వేదికపైకి చేరిన రాకెట్
- 8.54 గంటలకు మొదలైన కౌంట్ డౌన్
- 25.5 గంటల పాటు కొనసాగింపు
- రేపు ఉదయం 10.24 గంటలకు ప్రయోగం
ఈ ఏడాది మొదటి అంతరిక్ష ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. బ్రెజిల్ కు చెందిన అమెజానియా ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ51 శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లోని ప్రయోగ వేదికపైకి చేరింది. ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8.54 గంటలకు 25 గంటల 50 నిమిషాల కౌంట్ డౌన్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మొదలుపెట్టింది.
బ్రెజిల్ పంపనున్న భూ పరిశీలన ఉపగ్రహం అమెజానియా1తో పాటు మరో 18 ఉపగ్రహాలతో ఆదివారం ఉదయం 10.24 గంటలకు రాకెట్ గగన వీధుల్లోకి దూసుకెళ్లి కక్ష్యలోకి ఉపగ్రహాలను చేర్చనుంది. ఇది 53వ పీఎస్ఎల్వీ ప్రయోగం కాగా.. మొత్తంగా ఇస్రో చేపట్టనున్న 78వ ప్రయోగం. అంతేగాకుండా రెండు సాలిడ్ ఇంజన్ బూస్టర్లు కలిగిన ‘డీఎల్’ రకం పీఎస్ఎల్వీ మూడో ప్రయోగమిది.
ఇక, ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) చేపడుతున్న మొట్టమొదటి ప్రయోగం. దీనితో పాటు అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ అనే సంస్థ ఉపగ్రహాల ప్రయోగాన్నీ ఎన్ఎస్ఐఎల్ చేపడుతుందని ఇస్రో ప్రకటించింది. 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాల ప్రయోగాలను ఇస్రో చేపడుతుందని వెల్లడించింది.