India: ఉగ్రముప్పును ఎదుర్కొనేందుకు... ఏ దేశంపైనైనా సైనిక చర్యలు: భారత్ హెచ్చరిక
- ఉగ్రవాదులకు సాయం చేస్తున్న కొన్ని దేశాలు
- ఐరాస భద్రతామండలిలో భారత ప్రతినిధి
- ఆత్మ రక్షణ చర్యలు తప్పుకాదన్న నాగరాజ్ నాయుడు
ఏదైనా దేశం తన సార్వభౌమత్వం ముసుగులో ఉగ్రమూకలకు శిక్షణ నిస్తూ, వారికి సాయపడుతూ, ప్రోత్సాహం కల్పిస్తే, అటువంటి దేశంపై సైనిక చర్యలకు వెనుకాడబోమని భారత్ హెచ్చరించింది. గురువారం జరిగిన భద్రతామండలి అనధికార సమావేశంలో భారత ప్రతినిధి, ఐరాసలో శాశ్వత డిప్యూటీ రాయబారి నాగరాజ్ నాయుడు మాట్లాడారు. ఏ దేశం పేరునూ ప్రస్తావించకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు మరో దేశం భూ భాగంపై తాము ముందస్తు దాడులకు దిగాల్సి వస్తోందని, సాయుధ దాడి ముప్పును ఎదుర్కొనేందుకే ఈ తరహా చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2001లో భద్రతా మండలి చేసిన 1368, 1373 తీర్మానాలు కూడా ఉగ్రముప్పును ఎదుర్కొనేందుకు ఆత్మ రక్షణ చర్యలకు దిగడం తప్పుకాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఈ సమావేశం మెక్సికోలో జరుగగా, తీవ్రమైన పరిస్థితి ఏర్పడితే, ఏ దేశమైనా ఆత్మరక్షణ చర్యలకు దిగడం ఓ ప్రాథమిక హక్కని ఆయన ప్రస్తావించారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న శిబిరాలపై ఇండియా వాయుసేన దాడులు జరిపిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించడం గమనార్హం.
ఇక, పాకిస్థాన్ తో తాము సాధారణ సత్సంబంధాలనే కోరుతున్నామని, రెండు దేశాల మధ్యా ఉన్న వివాదాస్పద అంశాలను శాంతిపూర్వక వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడివున్నామని నిన్న భారత విదేశాంగ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.