Mumbai: పీఎం లోన్ స్కీమ్ అంటూ మోసం.. అడిగిన వివరాలన్నీ ఇచ్చేసిన 2.8 లక్షల మంది!
- వ్యక్తిగత సమాచారానికి భారీ ముప్పు
- 4 వేల మంది నుంచి రూ.4 కోట్లు వసూలు చేసిన గ్యాంగ్
- రాజకీయ నేత సహా నిందితుల అరెస్ట్
- రూ.5 లక్షల దాకా రుణాలిస్తామంటూ మోసం
- పాన్, ఆధార్, ఓటర్ ఐడీ వివరాల చోరీ
ఒక్కరా? ఇద్దరా?.. డబ్బులు వస్తాయనే సరికి లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వేలాది మంది డబ్బులు కట్టారు. చివరకు మోసం అని గ్రహించి లబోదిబోమన్నారు. డబ్బు పోయిందనుకుంటే.. లక్షలాది మంది వ్యక్తిగత సమాచారానికి కూడా ముప్పు ఏర్పడింది. వారి పాన్, ఆధార్, ఓటర్ ఐడీ వంటి వివరాలన్నింటినీ కేటుగాళ్లు కొట్టేసి.. చాప చుట్టేశారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘరానా మోసం వివరాలు...
కరోనా లాక్ డౌన్ తో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలిసిందే. చాలా మందికి పనుల్లేక, జీతాలు రాక పస్తులుండాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. కొందరు వలస కూలీలు సొంతూర్లకు నడిచే వెళ్లిపోయారు. ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేటుగాళ్లు.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి రుణ పథకం, ముద్ర రుణ పథకాల పేరిట ఫేక్ లోన్ల తంతును నడిపించారు. దానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ రాజకీయ నాయకుడూ సహకరించారు. ప్రధానమంత్రి లోన్ యోజన, ప్రధానమంత్రి యోజన లోన్, సర్వోత్తమ్ ఫైనాన్స్ వంటి ఫేక్ వెబ్ సైట్లనూ ప్రారంభించి జనాలను నమ్మించారు.
2.8 లక్షల మంది బాధితులు.. డబ్బు కోల్పోయిన 4 వేల మంది
కేటుగాళ్ల మోసానికి దాదాపు 2.8 లక్షల మంది బాధితులైనట్టు పోలీసులు చెబుతున్నారు. తమ పాన్, ఆధార్, ఓటర్ ఐడీ వంటి వివరాలు ఇచ్చారని అన్నారు. దాదాపు 4 వేల మంది నుంచి సైబర్ మోసగాళ్లు రూ.4 కోట్ల దాకా వసూలు చేశారని నిగ్గు తేల్చారు. ఓ బాధితుడు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.
పీఎంవైఎల్, పీఎం భారత్ లోన్ యోజన, ప్రధాన మంత్రి యోజన లోన్, సర్వోత్తమ్ ఫైనాన్స్, ప్రధాన మంత్రి ముద్ర లోన్, భారత్ యోజన లోన్, ముద్ర లోన్, కృష్ణ లోన్ వంటి పేర్లతో ఫేక్ లోన్ గ్యాంగ్ ను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. కొన్ని సోషల్ మీడియా సైట్లలో నిందితులు వాటిపై ప్రకటనలు కూడా ఇచ్చినట్టు తేల్చారు. దాని మీద క్లిక్ చేసిన బాధితులకు సంబంధించి సమగ్ర వివరాలనూ తీసుకున్నారని గుర్తించారు. లోన్ అవసరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజును నిర్ధారించినట్టు గ్రహించారు.
రూ.లక్ష నుంచి రూ.5 లక్షల దాకా రుణాలిస్తామంటూ కేటుగాళ్లు హామీలిచ్చినట్టు తేల్చారు. దానికి షూరిటీ, బాండ్స్ ఏవీ అవసరం లేవనడంతో చాలా మంది రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని గుర్తించారు. ఈ లోన్ల మోసం కోసం యూపీలోని అలీగఢ్, రాజస్థాన్ లోని జైపూర్ లో కాల్ సెంటర్లూ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. విద్యార్థులనే అందులో ఉద్యోగులుగా నియమించారు. ఆ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు.. రాజకీయ నేత సహా నిందితులను అరెస్ట్ చేశారు.