Surat: 125 ఏళ్ల కాంగ్రెస్ ను సూరత్ ప్రజలు ఓడించారు: గుజరాత్ స్థానిక ఎన్నికలపై అరవింద్ కేజ్రీవాల్
- సూరత్ లో సత్తా చాటిన ఆప్
- ప్రధాన ప్రతిపక్ష హోదా ఇక ఆప్ కు
- గెలిచిన వారంతా బాధ్యతతో వ్యవహరిస్తారన్న కేజ్రీవాల్
గుజరాత్ లో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు చెప్పుకోతగ్గ స్థానాలను సాధించడంపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ముఖ్యంగా సూరత్ మునిసిపల్ పరిధిలో 27 సీట్లను గెలుచుకున్న ఆప్, కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ, "125 ఏళ్ల పార్టీని సూరత్ ప్రజలు ఓడించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాను ఆప్ కు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన వారంతా బాధ్యతతో, నిజాయతీతో వ్యవహరిస్తారని ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను" అన్నారు.
ఆదివారం నాడు రాష్ట్రంలో మొత్తం 576 స్థానాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ 483 చోట్ల, కాంగ్రెస్ 55 చోట్ల, ఆప్ 27 చోట్ల విజయం సాధించాయి. ఆప్ గెలిచిన అన్ని స్థానాలూ సూరత్ లోనే కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా పొందలేదు. సూరత్ పట్టణంలో పీఏఏఎస్ (పటీదార్ అనామత్ ఆరక్షన్ సమితి) కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరించడంతో, ఆప్ కు పరిస్థితి అనుకూలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాస్ కు చెందిన పలువురికి ఆప్ టికెట్లను ఇవ్వగా, వారిలో అత్యధికులు, ముఖ్యంగా పటీదార్ వర్గానికి చెందిన వారు విజయం సాధించారు.
ఇక గుజరాత్ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు ఉదయించాయని వ్యాఖ్యానించిన అరవింద్ కేజ్రీవాల్, పట్టణంలో 24 గంటల విద్యుత్, ప్రజలకు ఆరోగ్య వసతులతో పాటు, మెరుగైన విద్యను కల్పించే విషయంలో కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 26న తాను సూరత్ లో పర్యటించనున్నట్టు వెల్లడించారు.