Disha Ravi: టూల్ కిట్ కేసులో దిశా రవికి బెయిల్ మంజూరు.. పోలీసుల వాదనతో ఏకీభవించని జడ్జి!

Activist Disha Ravi Gets Bail From Delhi Court

  • 22 ఏళ్ల దిశా రవికి బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
  • జనవరి 26 హింసకు, దిశకు సంబంధంపై సాక్ష్యాలు అడిగిన కోర్టు
  • సందర్భోచిత సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలన్న పోలీసులు

టూల్ కిట్ కేసులో 22 ఏళ్ల పర్యావరణ కార్యకర్త దిశా రవికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 1 లక్ష విలువైన రెండు షూరిటీలు సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళలకు మద్దతుగా టూల్ కిట్ ను రూపొందించారనే ఆరోపణలతో ఈ నెల ప్రారంభంలో ఆమెను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశా రవి, నికిత జాకోబ్, షాంతను ములుక్ లు ఖలిస్థానీ గ్రూప్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు టూల్ కిట్ ను రూపొందించారని పేర్కొన్నారు. ఖలిస్థానీ గ్రూప్ ను మళ్లీ పునరుద్ధరించేందుకు వీరు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

దిశా రవి బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ సందర్భంగా పోలీసుల తరపు లాయర్ వాదిస్తూ... రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసను ప్రేరేపించేందుకు దిశా రవి యత్నించారని చెప్పారు. దీంతో, అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా మాట్లాడుతూ, జనవరి 26న చోటు చేసుకున్న హింసతో దిశా రవికి సంబంధం ఉందనేందుకు మీ వద్ద ఏ ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా... కుట్రకు సంబంధించిన విషయాలలో సందర్భోచిత సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు వాదించారు. ఈ వాదనతో జడ్జి ఏకీభవించలేదు. జనవరి 26 హింసకు, దిశా రవికి మధ్య సంబంధం ఉందని చెప్పేందుకు మీ వద్ద ఎలాంటి పక్కా ఆధారాలు లేవా? అని ప్రశ్నించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.

Disha Ravi
Activist
Toolkit Case
Delhi Court
Bail
  • Loading...

More Telugu News