Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
- సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
- వెలగపూడి సచివాలయంలో సమావేశం
- విశాఖ ఉక్కు కర్మాగారంపై చర్చ
- అసెంబ్లీలో తీర్మానానికి నిర్ణయం
- ఈబీసీ నేస్తం పథకం అమలుకు ఆమోదం
- నవరత్నాల అమలు క్యాలెండర్ ఆమోదం
సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. వెలగపూడి సచివాలయంలో చేపట్టిన ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపైనా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, ఇతర కార్యక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇక, ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏఎంఆర్డీయేకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి కూడా ఆమోదం లభించింది. వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గ సభ్యులు పచ్చజెండా ఊపారు. కాకినాడ సెజ్ భూముల నష్టపరిహారం ఖరారుకు ఆమోదం లభించింది. కమిటీ సూచించిన పరిహారం కంటే ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించారు. నవరత్నాల అమలు క్యాలెండర్ కు కూడా ఈ కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూకేటాయింపులపైనా ఈ సమావేశంలో చర్చించారు. కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కుకు, అంబాపురంలో 93.99 ఎకరాలతో మరో ఇండస్ట్రియల్ పార్కుకు ప్రతిపాదించారు. ఈ రెండు పారిశ్రామిక పార్కులకు ఉచితంగా భూమి కేటాయింపులు జరపాలన్న అంశాన్ని చర్చించారు. ఏపీఐఐసీకి ఉచిత భూ కేటాయింపులపైనా, కడప స్టీల్ ప్లాంట్ కు 3,148 ఎకరాలు కేటాయింపుపైనా మంత్రివర్గంలో చర్చ జరిపారు. ఎకరం రూ.1.65 లక్షల చొప్పున విక్రయించాలన్న ప్రతిపాదన చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ మారిటైమ్ బోర్డుకు ఎకరం రూ.25 లక్షల చొప్పున 165 ఎకరాల భూమి కేటాయింపుపై ప్రతిపాదించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు 23 కీలక అంశాలను ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.