India: రేపటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ తమదేనంటున్న ఇంగ్లండ్!
- రేపటి నుంచి మూడో టెస్ట్
- సిద్ధమైన భారత్, ఇంగ్లండ్ జట్లు
- టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు కీలకం
- గెలుస్తామన్న నమ్మకం ఉందన్న ఆర్చర్
అహ్మదాబాద్ లో రీమోడల్ చేసిన మొతేరా స్టేడియంలో రేపటి నుంచి ఇంగ్లండ్ - ఇండియాల మధ్య మూడవ టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్ గా జరుగనుండగా, ఇరు జట్లకూ మ్యాచ్ విజయం అత్యంత కీలకంగా మారింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో చోటు సంపాదించుకోవాలంటే ఈ మ్యాచ్ గెలిచిన టీమ్ కు మంచి అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నైలో రెండు టెస్ట్ లు పూర్తి కాగా, ఇరు జట్లూ చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి.
ఈ మ్యాచ్ కి రెండు జట్లూ పూర్తి సన్నద్ధం కాగా, ఈ మ్యాచ్ గెలిస్తే, సిరీస్ ను తాము గెలిచినట్టేనని ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వ్యాఖ్యానించాడు. తాము టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే, ఈ మ్యాచ్ గెలుపు అత్యంత ఆవశ్యకమని అన్నాడు. పింక్ బాల్ పై తన అభిప్రాయాలు చెబుతూ, ఇది కూడా మామూలు బంతిలానే ఉంటుందని, ఈ బంతిని తాను చాలాసార్లు వాడానని అన్నాడు.
ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే, నాలుగో మ్యాచ్ ని తాము డ్రా చేసుకున్నా సరిపోతుందని, అందుకే ఇది అత్యంత కీలకమని చెప్పుకొచ్చిన ఆర్చర్, ఇక్కడ విజయం సాధిస్తే, చివరి మ్యాచ్ చేజారకుండా చూసుకుంటామని తెలిపాడు.
కాగా, నూతనంగా నిర్మించిన ఈ స్టేడియంలో మొత్తం లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం ఉండగా, కరోనా కారణంగా 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే తొలి టెస్ట్ కు అందుబాటులో ఉంచిన 50 వేల టికెట్లు అమ్ముడైపోయాయి.