Anil Kumar Yadav: ఓడిపోతే సంబరాలు చేసుకునే పార్టీ భారతదేశ చరిత్రలో టీడీపీ ఒక్కటే: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- పంచాయతీ ఫలితాల రగడ
- చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్న అనిల్
- సొంత ఇలాకాలోనే 20 శాతం గెలవలేకపోయారని ఎద్దేవా
- తమకు 81 శాతం వచ్చాయని వెల్లడి
- టీడీపీ 16 శాతం మాత్రమే గెలిచిందని వివరణ
- అది కూడా వైసీపీ రెబెల్స్ వల్లేనని వ్యాఖ్యలు
నిన్న పంచాయతీ ఎన్నికలు ముగిశాక మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా సంబరాలు చేసుకోవడంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఓడిపోయిన పార్టీ సంబరాలు చేసుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి 81 శాతం స్థానాలు లభిస్తే, టీడీపీ గెలిచింది 16 శాతం స్థానాలేనని వెల్లడించారు. అది కూడా వైసీపీ తిరుగుబాటుదారుల వల్ల ఆ మాత్రం స్థానాలు వచ్చాయని, కానీ చంద్రబాబు 41 శాతం గెలిచామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సంబరాలు చేసుకునే పార్టీ భారతదేశ చరిత్రలో టీడీపీ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ప్రతి విడతలోనూ తెలుగుదేశం పార్టీ పుంజుకుంది అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటనలు చేయడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే గెలిచినవాళ్లకు తన పార్టీ కండువాలు కప్పి ప్రదర్శించాలని అనిల్ కుమార్ సవాల్ విసిరారు.
సొంత నియోజకవర్గం కుప్పంలోనే 20 శాతం సాధించలేని చంద్రబాబు 41 శాతం గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. చివరికి బూత్ స్థాయిలో గెలిచినా సంబరాలు చేసుకునే స్థాయికి టీడీపీ దిగజారిపోయిందని విమర్శించారు. ఓవరాల్ గా వైసీపీకి ప్రజలు 81 శాతం విజయాలు అందించి సీఎం జగన్ పై నమ్మకం ఉంచారని, అందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.