Mamata Banerjee: మమతా బెనర్జీ మేనల్లుడి భార్యకు సీబీఐ సమన్లు
- కోల్ మాఫియా నుంచి ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు
- రేపు సీబీఐ అధికారులను కలవాలంటూ రుజిరా బెనర్జీకి సమన్లు
- ఉదయం 11 నుంచి 3 గంటల్లోపు ఎప్పుడైనా తన నివాసానికి రావచ్చన్న రుజిరా
బొగ్గు స్మగ్లింగ్ వ్యవహారంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సీబీఐ నిన్న సమన్లు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య విచారణ అధికారులను కలవచ్చని సమన్లలో పేర్కొంది. ఈ అంశంపై రుజిరా బెనర్జీ మాట్లాడుతూ, తనను విచారించాలనుకోవడానికి గల కారణాలేమిటో తనకు తెలియదని ఆమె అన్నారు.
మరోవైపు సమన్లు వచ్చిన నేపథ్యంలో, సీబీఐకి రుజిరా బెనర్జీ లేఖ రాశారు. తనను ఎందుకు విచారించాలనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని లేఖలో ఆమె పేర్కొన్నారు. రేపు 11 గంటల నుంచి 3 గంటల మధ్యలో మీరు ఎప్పుడైనా తన నివాసానికి రావచ్చని తెలిపింది. మీ షెడ్యూల్ ఏమిటో తనకు తెలియజేయాలని కోరారు.
తృణమూల్ కాంగ్రెస్ నేతలు కోల్ మాఫియా నుంచి రెగ్యులర్ గా ముడుపులు అందుకున్నారనే అభియోగాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. అభిషేక్ బెనర్జీ మరదలు మేనకా గంభీర్ కు కూడా సమన్లు పంపింది. దక్షిణ కోల్ కతాలో మేనక ఉంటున్న అపార్ట్ మెంట్ కు కాసేపటి క్రితం సీబీఐ బృందం చేరుకుంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీబీఐ సమన్లు రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది.