TDP: జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు జనం నాంది పలికారు: టీడీపీ

People ready to end jagan ruling says tdp leaders

  • ఫలితాల విడుదల తర్వాత మాట్లాడిన టీడీపీ నేతలు
  • మంగళగిరి పార్టీ కార్యాలయంలో సంబరాలు
  • వైసీపీ నేతలు రాత్రివేళ ఫలితాలు మార్చేస్తున్నారని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న జరిగిన నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ నేతలు మాట్లాడారు. రాత్రి 11 గంటల సమయానికి 848 పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలుపొందారని పేర్కొన్నారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 1,202 చోట్ల విజయం సాధించినట్టు చెప్పారు.

 వైసీపీ అరాచక పాలన అంతానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉదాహరణ అని, జగన్ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు నాంది పలికారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల విజయంతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ వైసీపీ నేతలు రాత్రివేళ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారని ఆరోపించారు. చీకటి పడ్డాక ఎన్నికల ఫలితాల సరళిలో మార్పులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. డీజీపీ ఇదేమీ పట్టించుకోకుండా విజయనగరంలో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి దశలోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయాల శాతం పెరుగుతూ వచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. మొదటి దశలో 38.7 శాతం గెలిస్తే, రెండో దశలో 39.5 శాతం, మూడో దశలో 41.4 శాతం, నాలుగో దశలో 50 శాతం పంచాయతీల్లో తమ మద్దతుదారులు విజయం సాధించారని అన్నారు.

రాత్రి ఏడు గంటల తర్వాత ఫలితాలను వైసీపీ తారుమారు చేస్తోందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. టీడీపీ మద్దతుదారులకు ప్రతిచోట 40 శాతం ఓట్లు వచ్చాయంటే వైసీపీని ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.

  • Loading...

More Telugu News