Hari Shankar Reddy: ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయచోటి కుర్రాడు!

Kadapa boy selected for IPL

  • హరిశంకర్ రెడ్డిని సొంతం చేసుకున్న సీఎస్కే
  • ప్రస్తుతం ఆంధ్ర రంజీ జట్టుకు ఆడుతున్న హరిశంకర్
  • అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన శ్రీకాంత్ రెడ్డి

కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన కుర్రాడు ఐపీఎల్ కు ఎంపికయ్యాడు. ఆంధ్ర రంజీ జట్టుకు ఆడుతున్న హరిశంకర్ రెడ్డిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ కుర్రాడిది చిన్నమండెం మండలం నాగూరివాండ్లపల్లె గ్రామం. అతని తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవిలు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నారు. వీరి పెద్ద కుమారుడు ఉపాధి కోసం కువైట్ కు వెళ్లాడు.

ఇక రెండో కుమారుడైన హరిశంకర్ రెడ్డి డిగ్రీ వరకు చదువుకున్నాడు. బౌలింగ్ లో మంచి ప్రతిభను కనపరిచిన హరిశంకర్ 2016లో రాష్ట్ర అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్ర రంజీ జట్టుకు ఆడుతున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ కు జరిగిన మినీ వేలంపాటలో హరిశంకర్ ను సీఎస్కే రూ. 20 లక్షలకు దక్కించుకుంది.

మరోవైపు హరిశంకర్ రెడ్డి ఐపీఎల్ కు ఎంపిక కావడం పట్ల అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అతని తండ్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, హరిశంకర్ కు క్రికెట్ అంటే ప్రాణమని చెప్పారు. కాలేజీకి సరిగా వెళ్లకుండా ఏ చిన్న టోర్నమెంటు జరిగినా వెళ్లేవాడని, తమ కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అని తాము బాధపడేవాళ్లమని... కానీ, ఇప్పుడు అతన్ని చూసి గర్విస్తున్నామని తెలిపాడు.

మరోవైపు హరిశంకర్ ను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. ఉత్తమ ప్రతిభను కనపరిచి, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, టీమిండియాకు ఆడాలని ఆకాంక్షించారు.

Hari Shankar Reddy
IPL
Kadapa District
  • Loading...

More Telugu News