Jagan: జగన్ పై కేసు ఉపసంహరణకు అనుమతించిన కోర్టు
- అనుమతి లేకుండా ఎన్నికల ర్యాలీ నిర్వహించారని 2014లో కేసు
- ఇటీవలే ప్రజాప్రతినిధుల కోర్టుకు కేసు బదిలీ
- కేసును ఉపసంహరించుకోవచ్చని కోదాడ పోలీసులకు కోర్టు అనుమతి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న కేసును ఉపసంహరించుకునేందుకు తెలంగాణలోని ప్రజాప్రతినిధుల కోర్టు అనుమతించింది. జగన్ పై నమోదైన కేసు ఉపసంహరణకు కోదాడ పోలీసులకు అనుమతిని ఇచ్చింది. అనుమతి లేకుండానే ఎన్నికల ర్యాలీని నిర్వహించారని 2014లో జగన్ పై ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను ఇటీవలే ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేశారు. జగన్ పై ఉన్న కేసు ఉపసంహరణకు అనుమతిని ఇవ్వాలని కోదాడ పోలీసులు కోర్టును కోరారు.
ఇదే కేసులో ఉన్న ఏ2, ఏ3లపై కోదాడ కోర్టు కేసును కొట్టేసిందని కోర్టుకు తెలిపారు. మరోవైపు 2014లో ఫిర్యాదు చేసిన ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఎంపీడీఓ కోర్టుకు తెలిపారు. దీంతో, కేసు ఉపసంహరణకు కోర్టు అనుమతించింది.