Dia Mirza: కన్యాదానం లేదు.. అప్పగింతలూ లేవు: తన పెళ్లి విశేషాలను పంచుకున్న దియా మీర్జా
- ఓ మహిళా పూజారి తమ పెళ్లి చేశారని వెల్లడి
- తమ పెళ్లికి ఇది స్నేహితురాలి కానుక అన్న బాలీవుడ్ నటి
- ఆడ, మగ సమానమేనని చెప్పిన హైదరాబాదీ
- మార్పు ఎంపికతోనే మొదలవ్వాలని సూచన
పెళ్లంటే రెండు మనసులే కాదు.. కొన్ని కుటుంబాల కలయిక! హిందూ సంప్రదాయపు వివాహాల్లో జీలకర్ర బెల్లం, ఏడడుగులు, తలంబ్రాలు, తాళి, కన్యాదానం, అప్పగింతలు.. ఇవన్నీ భాగం. కానీ, 39వ ఏట హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి దియా మీర్జా.. రెండు తంతులను మాత్రం వదిలేశారు. కన్యాదానం, అప్పగింతలను తన పెళ్లిలో లేకుండా చూసుకున్నారు. వాటిని ఎందుకు వద్దనుకున్నారో కారణాలనూ చెప్పారు. ఈనెల 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖిని పెళ్లాడిన ఆమె.. ఆ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
19 ఏళ్లుగా రోజూ పొద్దున్నే తాను సమయం గడిపే తోటలోనే నిరాడంబరంగా తన పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. పెళ్లిలో ప్లాస్టిక్ ను అస్సలు వాడలేదని ఆమె చెప్పారు. పర్యావరణ హితంగా పెళ్లి జరిగిందన్నారు. సహజసిద్ధమైన జీవవిచ్ఛిన్న సామగ్రినే అలంకరణ కోసం వాడామని చెప్పారు.
మహిళా పూజారి తమ పెళ్లి జరిపించిందని, వేద సంప్రదాయం ప్రకారం నిర్వహించిందని చెప్పారు. తన చిన్ననాటి స్నేహితురాలు అనన్య పెళ్లికి వెళ్లేంత వరకు ఓ మహిళ పెళ్లి చేయిస్తుందన్న విషయం తెలియదని ఆమె అన్నారు. ఆమె ఎవరో కాదు.. తన స్నేహితురాలి ఆంటీ అయిన షీలా అని చెప్పారు. తన పెళ్లికీ ఆమెను పంపించి అనన్య మంచి కానుక ఇచ్చిందన్నారు. అంతకు మించి గొప్ప గౌరవం ఏముంటుందన్నారు.
మహిళలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అన్నారు. పుట్టుక కొత్తదని, పాత విషయాలను కొత్తగా నిర్వచించే ప్రయత్నం చేయాలని సూచించారు. తన పెళ్లిలో కన్యాదానం, అప్పగింతలు లేవన్నారు. మార్పు అనేది మన ఎంపికతోనే మొదలవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఆడ, మగ ఇద్దరూ సమానమేనన్నారు.