BJP: బీజేపీకి సాగు చట్టాల షాక్​: పంజాబ్​ లో ఏడు మున్సిపల్​ కార్పొరేషన్లను క్లీన్​ స్వీప్​ చేసిన కాంగ్రెస్

Farm Laws Shocker for BJP in Punjab

  • ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ
  • 53 ఏళ్ల తర్వాత బఠిండాను చేజిక్కించుకున్న హస్తం పార్టీ
  • రీపోలింగ్ పెట్టడంతో మొహాలీ ఫలితాల ప్రకటన రేపు

వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనల ప్రభావం బీజేపీపై భారీగానే పడింది. పంజాబ్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మోగా, హోషియార్ పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్ కోట్, బాటాలా, బఠిండాల్లో జయకేతనం ఎగురవేసింది. మరో స్థానం మొహాలీకి సంబంధించి రేపు ఫలితాలను ప్రకటించనున్నారు.

కాగా, బఠిండా మున్సిపల్ కార్పొరేషన్ పై 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరడం విశేషం. బఠిండా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వం వహిస్తుంటే.. ఇటీవలే ఎన్డీయే నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే, పైచేయి కాంగ్రెస్ దే అయింది.

ఫిబ్రవరి 14న 109 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 71.39 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని బూత్ లలో మంగళవారం రీపోలింగ్ జరిగింది. మొహాలీ కార్పొరేషన్ కు సంబంధించి 32, 33వ నెంబర్ బూత్ లకు రీపోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొహాలీ కార్పొరేషన్ ఫలితాలను గురువారం ప్రకటించనున్నారు.

మొత్తం 9,222 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా 2,832 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీల వారీగా అయితే కాంగ్రెస్ 2,037 మందిని పోటీలో నిలిపింది. శిరోమణి అకాలీ దళ్  తరఫున 1,569 మంది పోటీ చేయగా.. బీజేపీ నుంచి కేవలం 1,003 మందే పోటీ చేశారు.

  • Loading...

More Telugu News