Nikita Jacob: టూల్ కిట్ కేసులో లాయర్ నికితా జాకబ్ కు ఊరట
- టూల్ కిట్ తో తనకు సంబంధం లేదన్న నికిత
- మూడు వారాల ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చిన బాంబే హైకోర్టు
- అరెస్ట్ అయితే రూ.25 వేలు కట్టి బయటకు వచ్చేలా ఆదేశాలు
గ్రెటా థన్ బర్గ్ టూల్ కిట్ కేసులో ముంబై లాయర్ నికిత జాకబ్ కు ఊరట లభించింది. ఆమెకు మూడు వారాల పాటు ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు అంగీకరించింది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే.. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు అదే మొత్తానికి షూరిటీ ఇచ్చి బయటకు వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు బుధవారం బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ పీడీ నాయక్ తీర్పునిచ్చారు.
ఈ కేసులో ఇప్పటికే పర్యావరణ కార్యకర్త ఢిల్లీ పోలీసులు దిశా రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం లాయర్ నికిత జాకబ్ కు చెందిన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాను పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరైన జూమ్ మీటింగ్ లో పాల్గొన్న మాట వాస్తవమే అయినా.. టూల్ కిట్ తో మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తరఫు లాయర్ ద్వారా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే అరెస్ట్ ను ఆపేలా బెయిల్ ఇవ్వాలని బాంబే హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన జస్టిస్ నాయక్.. ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ‘‘కక్షిదారుది శాశ్వత నివాసం ముంబై. కానీ, కేసు నమోదైంది ఢిల్లీలో. అంతేగాకుండా ఆమె తాత్కాలికంగానే బెయిల్ రిలీఫ్ కోరుకుంటోంది. ఏ క్షణంలోనైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమె అంటోంది. కాబట్టి ఆలోపు వేరే రాష్ట్రంలోని కోర్టులో బెయిల్ కు సంబంధించిన రిలీఫ్ పొందడానికి ఆమెకు సమయం అవసరం’’ అని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేశారు.