Du Plesses: టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్ డూప్లెసిస్
- కెరీర్ లో 69 టెస్టులు ఆడిన డూప్లెసిస్
- తొలి టెస్టులోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఘనత
- ఇకపై టీ20కి అధిక ప్రాధాన్యతను ఇస్తానని వ్యాఖ్య
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డూప్లెసిస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తను రిటైర్ అవుతున్నట్టు ఈరోజు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఆయన స్పందిస్తూ, మానసికంగా తాను రిటైర్మెంట్ కు సిద్ధమయ్యానని, తాను ఊహించినట్టుగా తన రిటైర్మెంట్ లేదని చెప్పాడు.
ఆస్ట్రేలియా టూర్ తో రిటైర్ కావాలని తొలుత అనుకున్నానని... కానీ, అది కుదరలేదని అన్నాడు. తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని చెప్పాడు. ఇకపై టీ20 క్రికెట్ కు ప్రాధాన్యతను ఇస్తానని అన్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పాడు.
డూప్లెసిస్ తన కెరీర్ లో 69 టెస్టులు ఆడాడు. 2012-13 ఏడాదిలో తాను ఆడిన తొలి టెస్టులోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా డూప్లెసిస్ ఎంపికయ్యాడు. టెస్టుల్లో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలను సాధించాడు. మొత్తం 4,163 పరుగులు చేశాడు. 36 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. డూప్లెసిస్ సారధ్యంలో దక్షిణాఫ్రికా 18 మ్యాచుల్లో గెలవగా, 15 మ్యాచుల్లో ఓడిపోయింది. ఇటీవలి కాలంలో టెస్టుల్లో డూప్లెసిస్ ని వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి.