Japan: యువతలో ఒంటరితనాన్ని పోగొట్టేందుకట.. మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన జపాన్!
- జపాన్‌లో పెరుగుతున్న ఆత్మహత్యలు
- 2019తో పోలిస్తే గతేడాది 3.7 శాతం పెరిగిన బలవన్మరణాలు
- ‘మినిస్టర్ ఫర్ లోన్లీనెస్’ పేరుతో మంత్రిత్వ శాఖ
ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య జపాన్‌లో ఇటీవల పెరిగింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆత్మహత్యల నివారణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ‘మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్’ పేరుతో ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. ఈ శాఖను రీజనల్ రీవైటలేజన్ మంత్రికి కేటాయిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో ఒంటరితనాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడడమే ఈ మంత్రిత్వశాఖ విధి.
జపాన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో యువత ఆత్మహత్యలు ఒకటి. ఒంటరితనాన్ని తట్టుకోలేని యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఫలితంగా జననాల రేటు తగ్గిపోతుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం గతేడాది దాదాపు 21 వేల మంది ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 3.7 శాతం అధికం కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. కరోనా భయం, క్వారంటైన్, భౌతికదూరం, ఒంటరితనం వంటివి ఇందుకు కారణాలని తేల్చారు. ఈ నేపథ్యంలో యువత ఒంటరితనాన్ని జయించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది.
2018లో బ్రిటన్‌లోనూ ఇలాంటి మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసినప్పటికీ దాని ఉద్దేశం వేరు. ఒంటరితనం అనుభవిస్తున్న వృద్ధుల సంక్షేమం నిమిత్తం ఇంగ్లండ్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది.