Mumbai: ప్రజలు ఇలానే ఉంటే మరోసారి సంపూర్ణ లాక్ డౌన్... హెచ్చరించిన ముంబై మేయర్!

Mumbai Mayor Warns that another Lockdown
  • రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలు
  • ఎంత చెప్పినా వినడం లేదన్న మేయర్
మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబై మహా నగరంలో కొత్త కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ మేయర్ కిశోర్ పెడ్నేకర్ కీలక హెచ్చరికలు చేశారు. ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ ఉండటం, కొవిడ్ నిబంధనలను పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందనీ, ప్రజలు మారకుంటే, మరోసారి పూర్తి లాక్ డౌన్ ను విధించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.

కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలకు ఎంతగా చెప్పినా వినడం లేదని, ఈ కారణంతోనే పరిస్థితి విషమిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, సబర్బన్ రైళ్లలో తిరుగుతున్న వారిలో అత్యధికులు మాస్క్ లను ధరించడం లేదని గుర్తు చేశారు.

ఈ విషయంలో ప్రజలు వెంటనే మారాలని, అన్ని నిబంధనలను పాటించకుంటే కఠిన నిబంధనలు తప్పవని కిశోర్ ఫడ్నేకర్ అన్నారు. ఇంకోసారి లాక్ డౌన్ కావాలా? వద్దా?అన్న విషయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. కాగా, మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దాదాపు నెలన్నర తరువాత 14వ తేదీన 4 వేలకు పైగా కేసులు, 15న 3,300కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

తాజాగా మరో 23 మంది కన్నుమూశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 51 వేలను దాటగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 20.67 లక్షలు దాటింది. ఒక్క ముంబైలోనే మూడు లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. ప్రభుత్వం సైతం ప్రజలు కరోనా నిబంధనలను పాటించకుంటే, మరోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.
Mumbai
Corona Virus
New Cases
Lockdown

More Telugu News