Jeff Bezos: పడిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తి... మరోసారి అపర కుబేరుడిగా జెఫ్ బెజోస్!
- గత నెలలో టాప్ బిలియనీర్ గా అవతరించిన మస్క్
- ఇటీవలి కాలంలో పడిపోయిన టెస్లా విలువ
- ప్రస్తుతం మస్క్ కన్నా బెజోస్ ఆస్తి 955 మిలియన్ డాలర్ల అధికం
దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచి, గత నెలలో తన స్థానాన్ని ఎలాన్ మస్క్ కు వదులుకున్న అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్, తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇటీవలి కాలంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కు చెందిన కంపెనీల ఈక్విటీ వాటాల విలువ పడిపోవడంతో, ఆ ప్రభావం ఆయన ఆస్తుల విలువను తగ్గించింది. మంగళవారం నాడు డెస్లా వాటాల విలువ 2.4 శాతం పడిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ 4.6 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది.
పర్యవసానంగా జెఫ్ బెజోస్ తిరిగి వరల్డ్ నంబర్ వన్ బిలియనీర్ గా నిలిచారు. ప్రస్తుతం జెఫ్ ఆస్తుల విలువ 191.2 బిలియన్ డాలర్లని, ఎలాన్ మస్క్ కన్నా 955 మిలియన్ డాలర్ల ఎక్కువ ఆస్తిని ఆయన కలిగి వున్నారని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ర్యాంకింగ్ పేర్కొంది. కాగా, ఎలాన్ మస్క్ తొలి స్థానంలో దాదాపు ఆరు వారాల పాటు కొనసాగారు.
ఇటీవల ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ తో పాటు, అంతగా పేరు రాని మరో క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. టెస్లా అధినేత 1.5 బిలియన్ డాలర్లను బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేయగానే, ఒక్కో కాయిన్ విలువ 50 వేలను దాటింది. క్రిప్టో కరెన్సీలో ఆయన పెట్టుబడి పెట్టడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇదే సమయంలో జనవరి 26న ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న టెస్లా ఈక్విటీ వాటాల విలువ, ఆపై దాదాపు 10 శాతం వరకూ పతనమైంది. ఈ కారణంతోనే ఎలాన్ మస్క్, కుబేరుల జాబితాలో మరోసారి రెండో స్థానానికి పరిమితం అయ్యారు.