Chandrababu: స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదు... పల్లా ఉద్యమానికి ఊపిరి పోశారు: చంద్రబాబు

Chandrababu met Palla Srinivasarao in Vizag

  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా దీక్ష
  • పల్లా దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • ఆసుపత్రిలో పల్లాను పరామర్శించిన చంద్రబాబు
  • మాజీ ఎమ్మెల్యేకు సంఘీభావం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైజాగ్ లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికారు. ఇవాళ విశాఖ వచ్చిన చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లాను కలిసి సంఘీభావం ప్రకటించారు. దీక్ష శిబిరం వద్ద భారీగా హాజరైన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ నగరం లేదని, ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు తన దీక్షతో ఊపిరి పోశారని పేర్కొన్నారు.

ఆనాడు ఉక్కు ఉద్యమంలో ఎవరూ తుపాకులకు భయపడలేదని, 32 మంది ప్రాణత్యాగాలు చేశారని చంద్రబాబు అన్నారు. ఇందిరాగాంధీ అంతటివారు సైతం దిగొచ్చారని తెలిపారు. ఉక్కు సంకల్పంతో ముందుకెళ్లి ఉక్కు కర్మాగారాన్ని సాధించారని గుర్తుచేశారు. నాడు అంతమంది ప్రాణత్యాగం చేస్తే, వారి ప్రాణత్యాగాల విలువ తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఓట్లు వేశాక జగన్ రెడ్డికి ప్రజలతో అవసరం తీరిపోయిందని, అందుకే హోదా గురించి మాట్లాడడంలేదని అన్నారు. ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో విధ్వంస పాలన షురూ చేశారని మండిపడ్డారు.

ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, దీని ద్వారా రూ.33 వేల కోట్ల పన్నులు చెల్లించారని వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా పన్నులు కట్టారని తెలిపారు.

తాను మెచ్చే నగరం ఎప్పటికీ విశాఖపట్నమేనని ఉద్ఘాటించారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని చంద్రబాబు అభివర్ణించారు. ఇక్కడి ప్రజలు ఎంతో నీతి నిజాయతీపరులని, అందుకే ఈ నగరాన్ని తాను అమితంగా ఇష్టపడతానని వివరించారు. ఒకప్పుడు చిన్నగ్రామంగా ఉన్న విశాఖ నేడు ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉందని పేర్కొన్నారు.

కాగా విశాఖ పర్యటనలో చంద్రబాబు వెంట ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేత సబ్బం హరి కూడా ఉన్నారు.

Chandrababu
Palla Srinivasarao
Vizag Steel Plant
Visakhapatnam
Telugudesam
  • Loading...

More Telugu News