MLC: ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలు.. టీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించాలని ఉత్తమ్ పిలుపు
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో చిన్నారెడ్డి, రాముల్ నాయక్
- టీఆర్ఎస్‌ను ఓడిస్తే హామీలు అమలవుతాయన్న ఉత్తమ్
- తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని మండిపాటు
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్‌లకు నిన్న గాంధీభవన్‌లో ఆ పార్టీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి బీఫారాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంలో పీహెచ్‌డీ చేసిన చిన్నారెడ్డి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాములు నాయక్‌లను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఆ పార్టీని ఓడించడమే ఏకైక మార్గమన్నారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. కాబట్టి ఆ రెండు పార్టీలను ఓడించాలని పట్టభద్రులను ఉత్తమ్ కోరారు.