Rajaiah: 15 రోజుల్లో 60 వేల సభ్యత్వాలు నమోదయ్యే వరకు గడ్డం తీయను: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిన
- టీఆర్ఎస్ సభ్యత్వాల సంఖ్య పెంచాలన్న సీఎం కేసీఆర్
- పార్టీ నేతలకు దిశానిర్దేశం
- జనగామ జిల్లా జఫర్ గఢ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజయ్య
- లక్ష్యం నెరవేరిన తర్వాతే గడ్డం తీస్తానని వెల్లడి
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్వత్వాల నమోదును ముందుకు తీసుకెళ్లాలంటూ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి.
జనగామ జిల్లాలో జఫర్ గఢ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో 60 వేల సభత్వాల నమోదయ్యేంత వరకు తాను గడ్డం తీయబోనని ప్రతినబూనారు.
ఇంతకుముందు తానెప్పుడూ గడ్డం పెంచలేదని, కానీ సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానని, అందుకే గడ్డం పెంచుతున్నానని వివరించారు. కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం నెరవేరే వరకు గడ్డం తీసే ప్రసక్తే లేదని అన్నారు.