Toolkit: టూల్ కిట్ ను రూపొందించింది ఎవరో చెప్పిన ఢిల్లీ పోలీసులు

Delhi police reveals who is the toolkit creaters

  • జనవరి 26 పరిణామాల నేపథ్యంలో తెరపైకి టూల్ కిట్
  • టూల్ కిట్ ను షేర్ చేసిన గ్రెటా థన్ బర్గ్
  •  టూల్ కిట్ లో రైతు ఉద్యమంపై వివరాలు
  • దిశ రవి, నికితా జాకబ్, శంతనులే టూల్ కిట్ రూపకర్తలన్న పోలీసులు 

మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదం టూల్ కిట్. ఇదొక ఆన్ లైన్ డాక్యుమెంట్ అని చెప్పాలి. ఓపెన్ సోర్స్ విధానంలో ఈ టూల్ కిట్ ను ఆన్ లైన్ లోనే మార్పులు చేర్పులు చేసేందుకు వీలుంటుంది. ఏదైనా సమస్య, దాని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలతో కూడిన బుక్ లెట్ నే టూల్ కిట్ అంటారు. క్షేత్రస్థాయిలో ఎవరు, ఎప్పుడు, ఏంచేయాలన్నదాన్ని ఈ టూల్ కిట్ నిర్దేశిస్తుంది. ఏదైనా ఉద్యమాల సమయంలో టూల్ కిట్ ద్వారా అందరినీ ఏకం చేసేందుకు ఆధునిక తరం నిరసనకారులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.

భారత రిపబ్లిక్ డే సందర్భంగా రైతుల పరేడ్ లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ టూల్ కిట్ డాక్యుమెంట్ ను అంతర్జాతీయ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ టూల్ కిట్ లో పేర్కొన్న అంశాలు ఖలిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమానికి ఊతమిచ్చేలా ఉన్నాయని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంక్షోభం తలెత్తేలా ఈ టూల్ కిట్ ను ఖలిస్తాన్ ఉద్యమ మద్దతుదారులు తయారు చేశారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆసక్తికర అంశాలు తెలిపారు.

బెంగళూరు అమ్మాయి దిశా రవి, ముంబయికి చెందిన నికితా జాకబ్, శంతనులే టూల్ కిట్ సృష్టికర్తలను వెల్లడించారు. వీరు ఖలిస్తాన్ అనుకూల పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీఎఫ్ జే)తో కలిసి టూల్ కిట్ కు రూపకల్పన చేశారని, ఆ తర్వాత దాన్ని గ్రెటా థన్ బర్గ్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపించారని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఈ టూల్ కిట్ ను గ్రెటా థన్ బర్గ్ బహిర్గతం చేయడంతో ఇది వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

జనవరి 26న డిజిటల్, భౌతిక దాడులు చేయాలని టూల్ కిట్ లో పిలుపునిచ్చారని, ఇక టూల్ కిట్ రెండో భాగంలో దేశ సాంస్కృతిక వారసత్వం, విదేశాల్లో ఉన్న భారత దౌత్యకార్యాలయాలను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారని ఢిల్లీ పోలీసు అధికారి ప్రేమ్ నాథ్ పేర్కొన్నారు. ముంబయిలో నికితా ఇంటిపై దాడుల్లో లభ్యమైన సమాచారం ఆధారంగానే దిశ రవి, శంతనులను అరెస్ట్ చేశామని చెప్పారు.

కాగా, ఆ టూల్ కిట్ లో రైతుల నిరసనల నేపథ్యంలో భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పేర్కొన్నారు. దాంతో పోలీసులు కూడా ఇది భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంగా భావించి, ఆ కోణంలోనే కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News