Chandrababu: ఇలాంటి రాజకీయాన్ని రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా?: చంద్రబాబు
- వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజం
- వైసీపీకి ఓటు వేయలేదని ఆస్తులు కూలగొట్టిస్తున్నారని ఆగ్రహం
- అటవిక చర్యలను ఖండిస్తున్నట్టు ప్రకటన
- ఇది ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అధికార పక్షంపై ధ్వజమెత్తారు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం ఇసప్పాలెం పరిధిలో వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్ల ముందు ఉండే డ్రైనేజీ మెట్లు, ర్యాంపులను పంచాయతీ కార్యదర్శి, పోలీసు అధికారులు దగ్గరుండి మరీ కూలగొట్టించడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి అటవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గోగులపాడు పంచాయతీ 5వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినందుకు వైసీపీ సర్కారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుందని ఆరోపించారు.
"మీ ప్రత్యర్థిని గెలిపించారని ప్రజలపై పగబట్టి వారి వ్యక్తిగత ఆస్తులు కూల్చుతారా?ఇలాంటి రాజకీయాలను రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా?" అని చంద్రబాబు నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో ఓ పొక్లెయిన్ ఇంటి ర్యాంపును కూల్చుతుండగా, ఆ ఇంటి యజమాని పొక్లెయిన్ కు అడ్డంపడుతున్న దృశ్యం కనిపిస్తోంది.