Revanth Reddy: పింఛన్లపై ఇచ్చిన హామీ నిలుపుకోండి... సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖాస్త్రం
- పెన్షన్ల అంశంపై బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి
- ఎన్నికల హామీ అమలు చేయాలని డిమాండ్
- అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలంటూ లేఖ
- పింఛన్ వయసును 60 నుంచి 57కి తగ్గించాలన్న రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రెండోసారి అధికారంలోకి వస్తే అర్హులందరికీ పింఛన్లు ఇవ్వడమే కాకుండా, పింఛన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారని రేవంత్ వెల్లడించారు. ఇప్పుడా హామీని నిలుపుకోవాలంటూ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. పింఛన్ల వ్యవహారంలో ప్రచారం ఎక్కువ, పనితనం తక్కువ అన్నట్టుగా కనిపిస్తోందని, హామీ అమలులో ఎలాంటి ముందడుగు లేదని తెలిపారు.
ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే వారిద్దరికీ పెన్షన్ మంజూరు చేయాలని రేవంత్ స్పష్టం చేశారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిళలకు సైతం పింఛన్ అర్హత కల్పించాలని కోరారు. ఈ మేరకు అర్హుల వివరాలు సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపట్టాలని వివరించారు. ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారన్న దానిపై గణన జరగకపోవడంతో అర్హులైన వారు కూడా పెన్షన్లు పొందలేకపోతున్నారని తెలిపారు.