Balineni Srinivasa Reddy: పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభంజనం స్పష్టమైంది: మంత్రి బాలినేని
- పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బాలినేని స్పందన
- జగన్ సంక్షేమ పథకాలు ఫలించాయని వెల్లడి
- వైసీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారని వివరణ
- ఫలితాల వివరాలు తెలిపిన బొత్స
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే వైసీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని తెలిపారు. తొలి రెండు విడతల ఎన్నికల్లో జగన్ ప్రభంజనం స్పష్టంగా కనిపించిందని అన్నారు. టీడీపీ కంచుకోటల్లో కూడా వైసీపీ బలపర్చిన అభ్యర్థులదే పైచేయి అయిందని బాలినేని వివరించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తమదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అటు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మాట్లాడుతూ, ఫలితాల వివరాలు తెలిపారు. రెండో విడతలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని, ఏకగ్రీవాలతో కలిపి 2,639 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారని వెల్లడించారు. టీడీపీ మద్దతుదారులు 536, జనసేన మద్దతుదారులు 36, బీజేపీ మద్దతుదారులు 6, ఇతరులు 108 స్థానాల్లో గెలుపొందారని బొత్స తెలిపారు.