Bears: ఎలుగుబంట్లకు స్వేచ్ఛనివ్వాలని చూస్తే ఇలా జరిగింది!
- ఉత్తర ఇరాక్ లో ఘటన
- ప్రజల ఇళ్లలో బందీలుగా ఉన్న ఎలుగుబంట్లు
- వైల్డ్ లైఫ్ ప్రాజెక్టులో భాగంగా భల్లూకాలకు విముక్తి
- బోనులోంచి వదలగానే జనాలపైకి దూసుకొచ్చిన ఎలుగుబంటి
ఉత్తర ఇరాక్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇక్కడి కుర్దిస్థాన్ ప్రాంతంలో ప్రజల ఇళ్లలో బందీలుగా ఉన్న 6 సిరియన్ బ్రౌన్ ఎలుగుబంట్లకు స్వేచ్ఛ ప్రసాదించాలని అక్కడి వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టు సభ్యులు నిర్ణయించారు. వాటిని బంధించిన ప్రజల నుంచి వాటిని విడిపించి సమీపంలోని అటవీప్రాంతానికి బోనుల్లో తరలించారు. భల్లూకాలు స్వేచ్ఛగా అటవీప్రాంతంలోకి వెళ్లే ఈ సామాజిక కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు, వార్తలు కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు కూడా తరలివచ్చారు.
అయితే, ఆ బోనుల్లోని ఎలుగుబంట్లను విడుదల చేయగా, వాటిలో ఒకటి ప్రజల మీదికి దూసుకొచ్చింది. తమకు స్వేచ్ఛ కల్పించిన వాళ్లపైనే దాడికి యత్నించింది. దాంతో వాళ్లు హడలిపోయారు. భల్లూకానికి దొరక్కుండా తప్పించుకునేందుకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. కాగా ఈ ఎలుగుబంట్లను దుహోక్ ప్రాంతంలోని గారా పర్వతం వద్ద విడుదల చేశారు.