Covid: తెలంగాణలో రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
- గత నెల 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్
- తొలి డోస్ తీసుకున్న వారికి ఈరోజు నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్
- తొలి డోస్ తీసుకోని వారు ఈ నెల 25 లోగా తీసుకోవాలన్న అధికారులు
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. గత నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈరోజు రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్ వేస్తున్నారు. టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, మొత్తం 140 కేంద్రాల్లో కోవిడ్ టీకాలు ఇస్తున్నట్టు చెప్పారు. తొలి విడతలో ఏ కంపెనీ డోస్ తీసుకున్నారో... రెండో విడతలో కూడా అదే కంపెనీ డోస్ తీసుకోవాలని అన్నారు. మొదటి డోస్ తీసుకోని సిబ్బంది ఈ నెల 25 లోగా డోస్ తీసుకోవాలని... 25వ తేదీ తర్వాత తొలి డోస్ ఇచ్చే అవకాశం లేదని చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన మూడు లక్షల మందికి పైగా సిబ్బంది వ్యాక్సినేషన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 58.3 శాతం మంది మాత్రమే తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. తొలి డోస్ వ్యాక్సినేషన్ ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇస్తున్నారు.