Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,511 కోట్ల విరాళాలు!
- రూ.1,500 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్
- ఇప్పటికే అంతకు మించి విరాళాల సేకరణ
- ఈ నెల 27 వరకు విరాళాల సేకరణ
- మరిన్ని కోట్ల విరాళాలు వచ్చే అవకాశం
అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్ తో పాటు పలు హిందూ సంఘాలు విరాళాల సేకరణను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రతి హిందువునూ రామాలయ నిర్మాణంలో భాగస్వామిని చేయాలని రామ జన్మభూమి ట్రస్ట్ భావిస్తోంది.
తద్వారా రామాలయం దేశ ప్రజలందరిదనే సందేశాన్ని చాటాలనుకుంటోంది. రూ.1,500 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్ వేసుకున్నారు. ఇప్పటికే భక్తుల నుంచి అంతకు మించి విరాళాలు వచ్చాయి. హిందువులే కాకుండా పలు మతాలకు చెందిన వారు కూడా రాముడి మందిరం కోసం విరాళాలు ఇస్తున్నారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలి విరాళం ఇవ్వడంతో ప్రారంభమైన విరాళాల కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. నిన్నటివరకు 1,511 కోట్ల రూపాయాలు విరాళాలు అందాయని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. ఈ నెల 27 వరకు విరాళాలను సేకరిస్తారు.
జనవరి 15 నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాలను ప్రారంభించినట్లు గుర్తు చేసింది. మరికొన్ని రోజులే విరాళాల సేకరణకు గడువు ఉండడంతో ఈ కాలంలో మరిన్ని కోట్ల రూపాయలు రానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వెండి ఇటుకలను కూడా పంపుతున్నారు.