Manya Singh: ఆటో డ్రైవర్​ కూతురు.. మిస్​ ఇండియా రన్నరప్​!

Manya Singh Daughter Of A Rickshaw Driver Crowned Miss India 2020 Runner Up

  • ఎన్నో కష్టాలకు ఎదురీది జీవితంలో గెలిచిన మాన్యా సింగ్
  • నిద్ర, తిండి లేని రాత్రులు గడిపానని వెల్లడి
  • కుటుంబం కోసం తానూ పనిచేశానని చెప్పిన మాన్య
  • రక్తం, చెమట, కన్నీటిని ధారబోసి విజయం సాధించానని వ్యాఖ్య
  • అమ్మానాన్న, తమ్ముడు ఎంతో ప్రోత్సహించారన్న యూపీ అమ్మాయి

ఎన్నో నిద్రలేని రాత్రులు.. పూటగడవని పరిస్థితులు.. చదువుకుందామంటే సహకరించని ఆర్థిక స్తొమత.. ఇవేవీ ఆమె ఆశయాన్ని ఆపలేకపోయాయి. కలలు నిజం కాకుండా అడ్డుకోలేకపోయాయి. తండ్రి ఆటో నడిపి కుటుంబాన్ని నెట్టుకొస్తే.. ఆమె కూడా ఓ చెయ్యేసింది. కుటుంబానికి అండగా నిలబడింది.

తన రక్తం, చెమట, కన్నీటిని ధారబోసి విజయాన్ని చేరింది. మిస్ ఇండియా రన్నరప్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆమె మాన్యా సింగ్. ఉత్తర్ ప్రదేశ్ లోని ఖుషీ నగర్ ఆమె సొంతూరు. బుధవారం ప్రకటించిన మిస్ ఇండియా ఫలితాల్లో రన్నరప్ గా నిలిచిన ఆమె.. కొన్ని రోజుల క్రితం తన కుటుంబం గురించి, తాను పడిన కష్టం గురించి చెప్పుకొచ్చింది. అన్ని కష్టాల్లోనూ ఎలా విజయం సాధించిందో వివరించింది.

‘‘నేను ఎన్నో నిద్రలేని, తిండి లేని రాత్రులు గడిపాను. కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నా. నేను కన్న కలలను నిజం చేసుకోవడానికి అహర్నిశలూ శ్రమించాను. నా రక్తం, చెమట, కన్నీటిని ధారబోశాను. మా నాన్న ఆటో డ్రైవర్. చాలీచాలని సంపాదనే వచ్చేది. స్కూలుకు వెళ్దామన్నా డబ్బులు లేని పరిస్థితి. అలాంటి సమయంలో చిన్న వయసులోనే నేనూ పనిచేయాల్సి వచ్చింది. వేరే వాళ్లు ఇచ్చిన దుస్తులనే ధరించేదాన్ని. దొరికే కొంచెం టైమ్ ను పుస్తకాలపై కేటాయించాను. కానీ, అదృష్టం కలిసి రాలేదు. నా పరీక్ష ఫీజు కట్టేందుకు ఉన్న కొద్దిపాటి నగలనూ అమ్ముకోవాల్సి వచ్చింది. నా కోసం మా అమ్మ చాలా కష్టపడింది’’ అని చెప్పుకొచ్చింది.

ఇంట్లో నుంచి పారిపోయి...

14 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయానని మాన్య చెప్పింది. ‘‘కొన్ని ఇళ్లలో అంట్లు తోమే పనికి కుదిరాను. పొద్దునంతా చదువు.. సాయంత్రమంతా పని. ఆ తర్వాత రాత్రి కాల్ సెంటర్ లో ఉద్యోగం. మొత్తంగా ఏదోలా చదువు పూర్తి చేశాను. రిక్షాకు ఎక్కువ డబ్బులు అవుతాయని స్కూలు, పని ప్రదేశాలకు నడిచి వెళ్లేదాన్ని. అలా మిగిలిన డబ్బులను ఆదా చేసేదాన్ని.

ఇవ్వాళ మిస్ ఇండియా వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా నాన్న, అమ్మ, తమ్ముడు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే. అనుకున్న కలలను తీర్చుకోవాలనుకునే తపన ఉంటే.. ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించొచ్చని ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశంతోనే నా కథ చెప్పా’’ అని మాన్య తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరంగా చెప్పుకొచ్చింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News