Chandrababu: ఎస్ఈసీ పూర్తిగా విఫలమైంది... కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: చంద్రబాబు

SEC failed in conducting panchayat elections says Chandrababu

  • వైసీపీ బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తోంది
  • చట్ట ఉల్లంఘనలపై కోర్టుకు వెళ్తాం
  • రాష్ట్రపతికి కూడా వివరాలను పంపుతున్నాం

పంచాయతీ ఎన్నికలను నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ తన అధికారాలను సరిగా వినియోగించలేదని అన్నారు. టీడీపీ మద్దతు పలికిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించి వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ మద్దతుదారులపై తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎస్ఈసీని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడారని, అధికారులను బెదిరించి ఏకగ్రీవాలు చేయించారని... ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న దుస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అధికార దుర్వినియోగం, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి కూడా వివరాలను పంపుతున్నామని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు ఎస్ఈసీ పూర్తి స్థాయిలో బాధ్యతలను నిర్వహించాలని అన్నారు.

  • Loading...

More Telugu News