Poola Ravinder: టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్!
- భువనగిరిలో పీఆర్టీయూ మహా ధర్నా
- పాల్గొని ప్రసంగించిన పూల రవీందర్
- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి
మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇకపై ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తానని అన్నారు. భువనగిరి కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాకు హాజరైన ఆయన, తెలంగాణ కోసం ఉపాధ్యాయ వర్గాలు ఎంతో పోరాటం చేశాయని అన్నారు.
తక్షణం ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుంటే, హైదరాబాద్ లో జరిగే మహాధర్నాలో పీఆర్టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామని చెప్పారు. తనకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదని, పీఆర్టీయూ తీసుకునే అన్ని నిర్ణయాలకూ కట్టుబడి వుంటానని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. 45 శాతం పీఆర్సీని ప్రకటించాలని, స్కూళ్లలో స్కావెంజర్ల నియామకం, బదిలీల షెడ్యూల్, ప్రమోషన్లపై తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.