digvijay: 'మోదీజీ చెప్పింది నిజమే..' అంటూ దిగ్విజయ్ ఎద్దేవా!
- ఇటీవల రాజ్యసభలో మాట్లాడిన మోదీ
- ఎఫ్‌డీఐని ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ అంటూ ప్రధాని వ్యాఖ్య
- విభజించి పాలించే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లారన్న దిగ్విజయ్
- దేశంలో మతం పేరుతో మోదీ ఇదే పాలనను అమలు చేస్తున్నారని చురక
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాజ్యసభలో చేసిన ప్రసంగంలో రైతుల ఆందోళన గురించి స్పందించిన విషయం తెలిసిందే. విదేశీ సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వరుసగా ట్వీట్లు చేయడంపై ఆయన మాట్లాడుతూ... ఎఫ్‌డీఐ అనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కొత్త అర్థం చెప్పారు. ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ (ఎఫ్‌డీఐ) అంటూ దాన్ని అభివర్ణించారు. భారత్‌లోకి ఈ విదేశీ విధ్వంసక సిద్ధాంతాలు ప్రవేశిస్తున్నాయని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. 'ఎఫ్‌డీఐ అంటే ఫారెన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ అంటూ ప్రధాని మోదీ నిర్వచించారు. కొంత మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా. విభజించి పాలించే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాళ్లు మనకు వదిలి వెళ్లారు. ప్రస్తుతం దేశంలో మతం పేరుతో మోదీ ఇదే పాలనను అమలు చేస్తున్నారు. ఐక్యతే ఈ దేశానికి ఉన్న శక్తి' అంటూ దిగ్విజయ్ మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ట్వీట్ చేశారు.