Uttarakhand: ఉత్తరాఖండ్ లో గల్లంతైన 150 మంది జలసమాధి..? ఇప్పటివరకు మూడు మృతదేహాలు స్వాధీనం

One hundred and fifty people feared dead in Uttrakhand incident as per reports

  • ఉత్తరాఖండ్ లో విరిగిపడిన మంచు చరియలు
  • ఉప్పొంగిన ధౌలిగంగా నది
  • డ్యామ్ తో పాటు ఎన్టీపీసీ పవర్ ప్లాంటు నీటమునక
  • కొట్టుకుపోయిన 150 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్న అధికారులు

ఉత్తరాఖండ్ లో ధౌలిగంగా నది ఆకస్మికంగా పోటెత్తడంతో తపోవన్ ఎన్టీపీసీ పవర్ ప్లాంటులో 150 మంది గల్లంతు కావడం తెలిసిందే. కాగా, ఎన్టీపీసీ సైట్ ఇంజినీర్ కథనం ప్రకారం, గల్లంతైన వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ప్రతినిధి వెల్లడించారు.

ఇక్కడి హిమాలయ పర్వత సానువుల్లో మంచు చరియలు విరిగిపడగా, ధౌలిగంగా నదిలో నీటిమట్టం హఠాత్తుగా పెరిగిపోయింది. దాంతో వరద నీరు సమీపంలోని డ్యాట్ సహా, పవర్ ప్లాంట్ ను, రేనీ గ్రామాన్ని ముంచెత్తింది. అధికారులు రేనీ గ్రామం నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఉత్తరాఖండ్ లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఘటనపై అమిత్ షా ఆరా తీశారు. ప్రస్తుతం ధౌలిగంగా పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ విధించారు. సహాయచర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి స్పందించారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించిన ఉమాభారతి దీనిపై ట్వీట్ చేస్తూ.... హిమాలయ పర్వత ప్రాంతం ఎంతో సున్నితమైనదని, గంగానది, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించకపోవడమే మంచిదని తాను మంత్రిగా ఉన్న సమయంలోనే విజ్ఞప్తి చేశానని వివరించారు.

  • Loading...

More Telugu News